కాటారం డివిజన్లో గాలివాన బీభత్సం..కొనుగోలు సెంటర్లలో తడిసి మద్దయిన వడ్లు, మక్కలు

కాటారం డివిజన్లో గాలివాన బీభత్సం..కొనుగోలు సెంటర్లలో తడిసి మద్దయిన వడ్లు, మక్కలు
  • మహదేవ్​పూర్  కొనుగోలు సెంటర్లోకి వరద నీరు చేరి కొట్టుకుపోయిన వడ్లు

మహాముత్తారం, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్  డివిజన్ లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కల్లాలు, కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులతో వడ్ల కుప్పలపై కప్పిన టార్పాలిన్  కవర్లు ఎగిరిపోయి, వడ్ల కుప్పులు నీటిపాలయ్యాయి. మహదేవపూర్  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం చెరువులా మారడంతో వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పరదాలు కప్పిన కుప్పలు మోకాళ్ల లోతు నీళ్లలో మునిగిపోవడంతో రైతులు బోరున విలపించారు.

బుధవారం వరద నీటిలో ఉన్న వడ్ల బస్తాలు, నీళ్ల నుంచి వడ్లను తీసి ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించారు. వీటితో పాటు మిరప, వరి, మక్కజొన్న, కురగాయల పంటలు అక్కరకు రాకుండా పోయాయి. కాటారం, మహాముత్తారం, మల్హర్, భూపాలపల్లి, గణపురం మండలాల్లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్ల వెంట భారీ వృక్షాలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహదేవపూర్​లో నీట మునిగిన సెంటర్ ను కలెక్టర్  రాహుల్  శర్మ సందర్శించారు. తడిసిన వడ్లను వెంటనే కాటారంలోని అన్నపూర్ణ బాయిల్డ్  రైస్  మిల్లుకు తరలించాలని ఆదేశించారు. వడ్ల తరలింపులో ఎక్కడా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. అకస్మాత్తుగా వర్షం రావడంతో కుప్పలపై కవర్లు టార్పాలిన్లు కప్పేందుకు కూడా సమయం లేకుండా పోయింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి కొనుగోలు సెంటర్​లో చింతం స్వామి అనే రైతుకు చెందిన రెండు ట్రాక్టర్ల వడ్లు కొట్టుకుపోయాయి.